జగన్ పాలన పర్వాలేదు.. చంద్రబాబును నమ్మలేం: అసదుద్దీన్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు.

By అంజి  Published on  26 Sept 2023 10:35 AM IST
Asaduddin Owaisi, Chandrababu arrest, APnews, CM Jagan

జగన్ పాలన పర్వాలేదు.. చంద్రబాబును నమ్మలేం: అసదుద్దీన్‌

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ అయిన విషయం తెలిసింది. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. రాజమండ్రి జైలులో చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఆయన జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసునన్నారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్‌ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసదుద్దీన్‌ ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయని, అందులో ఒకటి టీడీపీ అయితే, రెండోది జగన్ పార్టీ వైసీపీ అని వివరించారు.

ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంచి పాలన అందిస్తున్నారని అసద్ ప్రశంసించారు. జగన్ పాలన పర్వాలేదు.. కానీ చంద్రబాబును నమ్మలేమని అన్నారు. ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని అసదుద్దీన్‌ అన్నారు. అలాగే ఏపీలో పోటీ చేసే విషయమై కూడా అసదుద్దీన్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని, అక్కడ ఎంఐఎం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే తెలంగాణలో తమ పార్టీ శ్రేణులను వేధిస్తున్న ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటామంటూ అసదుద్దీన్‌ హెచ్చరించారు.

తమతో స్నేహంగా ఉంటే సహకరిస్తామని, స్నేహం పేరుతో వెన్నుపోటు పొడిస్తే ఒప్పుకోమన్నారు. తమకు పదవులపై ఆశలు లేవని అన్నారు. కాగా ఎంఐఎం అధినేత చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీని పైన టీడీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ప్రస్తావనకు రానుంది. అటు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరగనుంది.

Next Story