తెలంగాణలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయా?
Are COVID cases rising in Telangana districts. చైనా, అమెరికాతో సహా వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో
By అంజి Published on 21 Dec 2022 10:20 AM ISTచైనా, అమెరికాతో సహా వివిధ దేశాల్లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చాలా మంది ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రస్తుతానికి అవసరం అయినప్పటికీ, తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడం లేదని అధికారిక కోవిడ్ స్టేటస్ బులెటిన్‌లు చూపిస్తున్నందున భయపడాల్సిన అవసరం లేదు.
హైదరాబాద్‌లో కోవిడ్ కేసులు.
రాష్ట్రంలో రోజువారీ కోవిడ్ కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌లోనే ఉంది. డిసెంబర్ 20న రాష్ట్రంలో ఐదు కేసులు నమోదయ్యాయి. వీరిలో నలుగురు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం. గడిచిన ఏడు రోజుల్లో హైదరాబాద్‌లో 24 కోవిడ్ కేసులు నమోదవగా, నిజామాబాద్‌లో 3, రంగారెడ్డిలో 2, మహబూబ్‌నగర్‌లో 1, ఖమ్మంలో 1, నిజామాబాద్‌లో 1, కామారెడ్డి 1, హనుమకొండ 1, ఆదిలాబాద్‌లో 1 కేసులు నమోదయ్యాయి.
డిసెంబర్ 20 నాటికి, తెలంగాణలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 34, రికవరీ రేటు 99.51 శాతం. డబ్ల్యుహెచ్‌ఓ బెంచ్‌మార్క్ ప్రకారం.. రోజుకు మిలియన్‌కు 140 పరీక్షలు అంటే రోజుకు 56000 పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మంగళవారం నాడు 4654 పరీక్షలు జరిగాయి.
కోవిడ్ పరీక్షలను పెంచండి
అనేక దేశాల్లో కోవిడ్ కేసుల పెరుగుదలను చూసిన కేంద్ర ప్రభుత్వం మంగళవారం సానుకూల నమూనాల జన్యు శ్రేణిని (కోవిడ్ పరీక్షలను) పెంచాలని రాష్ట్రాలను కోరింది. ఈ ప్రక్రియ ఏదైనా కొత్త వేరియంట్‌ను ముందుగానే గుర్తించేలా చేస్తుంది. ఇది అధికారులు, వైద్య బృందాలు త్వరగా నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో.. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, కోవిడ్-19 యొక్క ప్రజారోగ్య సవాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని, వారానికి 35 లక్షల కేసులు నమోదవుతున్నాయని హైలైట్ చేశారు.
రాబోయే 90 రోజుల్లో ప్రపంచం మిలియన్ల సంఖ్యలో మరణాలను చూడవచ్చని ఇటీవలే, ఒక అగ్ర ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగల్-డింగ్ హెచ్చరించారు.
అతని అంచనాల ప్రకారం.. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60 శాతం, ప్రపంచ జనాభాలో 10 శాతం మందికి కరోనా సోకే అవకాశం ఉంది. ప్రస్తుతం కోవిడ్ ఉప్పెనను అదుపులో ఉంచడానికి చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చైనా దేశం అసాధారణమైన మరణాలను ఎదుర్కొంటోంది.