టీఎస్ ఆర్టీసీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్.. ఎంట్రీలకు ఆహ్వానం
April 21st is last date for TSRTC Short film Contest.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) మరింత మంది
By తోట వంశీ కుమార్ Published on 16 April 2022 6:21 AM GMTతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) మరింత మంది ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఎక్కువ మంది ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకునేలా చూడడం కోసం అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో షార్ట్ ఫిలిం ద్వారా ప్రజల్లోకి దూసుకువెళ్లేందుకు యత్నిస్తోంది. ఈ షార్ట్ ఫిలిం ద్వారా ప్రజలకు చేరవకావడమే కాకుండా ప్రతిభావంతమైన యువకులను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అందుకనే షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను ఆర్టీసీ నిర్వహిస్తోంది.
ప్రజారవాణా ప్రాముఖ్యతను గడప గడపకు తీసుకువెళ్లే సృజనాత్మకత మీలో ఉందా! ? తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలకు సులువుగా అవగాహన కల్పించాలనుకుంటున్నారా!? అయితే అలాంటి వారి కోసమే షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌ను ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి గా రూ.10 వేలు, రెండో బహుమతి రూ.5వేలు, మూడో బహుమతి రూ.2500 అందజేయబడుతుంది. అంతేకాకుండా 10 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనుంది.
కింద పేర్కొన్న అంశాలపైనే షార్ట్ ఫిలింలు తీయాల్సి ఉంటుంది
1.సురక్షితమైన ఆర్టీసీ ప్రయాణం
2.లీటర్ పెట్రోల్ ధర కన్నా తక్కువగా రూ.100కే రోజంతా హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణం
3.పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్
4. ఆర్టీసీ కార్గో సేవలు
5. గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు
గమనిక: పైన పేర్కొన్న ఏదో ఒక అంశంపైనే షార్ట్ ఫిలింలు తీయాల్సి ఉంటుంది. వ్యవధి : 120 Seconds/2 Mins
ఈ అంశాలపై ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండే షార్ట్ ఫిలింలను తీసి పంపించాలని కోరింది. ఈ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకుంటే మీ పూర్తి వివరాలను ఈ నెల(ఏప్రిల్) 21 లోగా tsrtcshortfilmcontest@gmail.com పంపించాల్సి ఉంటుంది.