తెలంగాణ గవర్నర్ తమిళిసై మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. శుక్రవారం సబితా ఇంద్రారెడ్డి గవర్నర్ ను కలవనున్నారు. యూనివర్శిటీల్లో కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు విషయంపై మంత్రి చర్చించనున్నారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, అపాయింట్ మెంట్ ఇస్తే కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లు గురించి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు ఉన్న సందేహాలన్నీ క్లారిఫై చేస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీంతో మంత్రి సబితకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు విద్యా శాఖ ఉన్నతాధికారులు రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. అంతకుముందు ఈ నెల 7న మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాశారు. అభిప్రాయం కోరారు. ఈ బిల్లు చెల్లుబాటు అవుతుందో లేదో తెలియజేయాలని సూచించారు. మూడేళ్లుగా యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని లేఖలో గవర్నర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్ తమిళిసై వద్ద పెండింగ్ లో ఉన్నాయి. అందులో యూనివర్శిటీస్ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లు కూడా ఉంది.