హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మరో బిగ్ అప్‌డేట్ వచ్చింది. ప్రభుత్వం ఇటీవలే ఆమోదించిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రాజీవ్ యువ వికాసం పథకంలో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీల నుంచి మొత్తంగా 44,800 అప్లికేషన్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం ప్రకారం.. మూడు గ్రూపులకు 1,9,5 శాతంతో రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.
కాగా బీ గ్రూప్ నుంచే అధిక దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం అర్హులైన వారిని వేగంగా ఎంపిక చేస్తోంది. లబ్ధిదారులకు జూన్ 2వ తేదీన యూనిట్ మంజూరు పత్రాలు అందించనున్నారు. ఇందుకోసం రూ.6 వేల కోట్లు విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అటు సిబిల్ స్కోర్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే స్పష్టం చేశారు.