తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఏడాది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహోత్సవాలకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. యాదగిరిగుట్టలో ఫిబ్రవరి 18 నుంచి వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11 రోజులు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. బ్రహోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 24న స్వామివారి ఎదుర్కోలు, ఫిబ్రవరి 25న స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇక, ఫిబ్రవరి 26న దివ్వవిమాన రథోత్సవం వేడుక నిర్వహించనుండగా... ఫిబ్రవరి 28న గర్భాలయంలోని మూలవరులకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల వేళ యాదగిరిగుట్ట ఆలయలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంపై దృష్టి సారించారు.