హైదరాబాద్: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో ఘట్‌కేసర్‌లో నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం అందెశ్రీ గాంధీ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ జీవో విడుదల చేశారు. ఈ జీవో మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజిగిరి జిల్లా కలెక్టర్లు, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
కుటుంబ సభ్యుల సూచన మేరకు ఘట్‌కేసర్ ఎన్ఎఫ్‌సీ నగర్‌లో అందెశ్రీ అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి తరలించారు. అనంతరం మధ్యాహ్నం ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియానికి తరలించారు. అయితే అందెశ్రీకి కడసారి నివాళులర్పించేందుకు పలువురు ప్రముఖులు లాలాపేటలోని ఆయన నివాసానికి తండోపతండాలుగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఘట్కేసర్ లో రేపు(మంగళవారం) జరగనున్న అందెశ్రీ అంత్యక్రియలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై అంతిమయాత్రలో పాల్గొంటారు.