ఇకపై ఆ పని చేయను, పోలీసుల విచారణ తర్వాత యాంకర్ ప్రకటన

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, టెలివిజన్ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు

By Knakam Karthik
Published on : 24 March 2025 3:03 PM IST

Hyderabad News, Anchor Shyamala, Betting Apps Case, Punjagutta Police

ఇకపై ఆ పని చేయను, పోలీసుల విచారణ తర్వాత యాంకర్ ప్రకటన

ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేశారనే కేసులో వైసీపీ అధికార ప్రతినిధి, టెలివిజన్ యాంకర్ శ్యామల పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. శ్యామలను పంజాగుట్ట పోలీసులు దాదాపు మూడు గంటల పాటు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో శ్యామల మాట్లాడుతూ.. బెట్టింగ్ ను ఇకపై ప్రమోట్ చేయనని చెప్పారు. బాధ్యతగల పౌరురాలిగా ఇలాంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా ప్రాణాలు కోల్పోయిన వారి లోటును ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. బెట్టింగ్ లకు పాల్పడటం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం తప్పేనని శ్యామల చెప్పారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని... విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. కేసు కోర్టు పరిధిలో ఉన్నందున... మాట్లాడటం సరికాదని చెప్పారు.

కాగా ఒక సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత విచారణకు రావాల్సిందిగా గతంలో పోలీసులు ఒకసారి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు ఆమె స్పందించలేదు. విచారణకు హాజరుకాకుండా నేరుగా శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే క్వాష్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చారు. శ్యామలను అరెస్టు చేయవద్దని, నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అలాగే ఈరోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో సోమవారం ఉదయం శ్యామల విచారణకు వచ్చారు.

Next Story