యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్‌కు జనగామ కోర్టు గురువారం నాడు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్ వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ఉన్న మేడె కుమార్, పెంబర్తి మణెమ్మ మరణించారు. కారు కూడా బోల్తా పడటంతో లోబోతో పాటు అందులో ఉన్న పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయగా నిన్న కోర్టు తీర్పు వెలువరించింది.
రఘునాథపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై నరేష్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్ తరఫును వీడియో షూటింగ్ కోసం లోబో టీమ్ రామప్ప, లక్నవరం, భద్రకాళి, వేయి స్తంభాల గుడి తదితర ప్రాంతాల్లో పర్యటించింది. ఆ తర్వాత లోబోనే స్వయంగా కారు నడుపుతూ వరంగల్ నుండి హైదరాబాద్‌కు వస్తుండగా రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఇద్దరు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. తాజాగా కోర్టు ప్రమాదానికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్ష విధించింది.