అంశాల స్వామి - ఫ్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన యోధ

Amshala Swamy is a warrior who fought a long struggle for the liberation of fluorosis.ఫ్లోరైడ్ బాధితుల్లో ఒక‌రే అంశాల స్వామి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jan 2023 8:06 AM GMT
అంశాల స్వామి - ఫ్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన యోధ

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్ర‌జ‌ల‌ను ఒకప్పుడు ఫ్లోరైడ్ స‌మ‌స్య వేధించేది. 967 గ్రామ‌ల్లోని దాదాపు ల‌క్ష మందికి పైగా ప్ర‌జ‌లు ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొన్నారు. ఎదుగుదల మందగించడం, వక్రంగా ఉన్న కాళ్లు, పాదాలు, వేళ్లు, ఎండిపోయిన లేదా కుళ్ళిన దంతాలతో బాధపడ్డారు. కొందరు ఈ రసాయన ప్రేరిత వ్యాధికి బ‌లైపోయారు. అలాంటి బాధితుల్లో ఒక‌రే అంశాల స్వామి.

జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఫ్లోరైడ్ సమస్యను ప్ర‌స్తావించేందుకు శివ‌న్న‌గూడెం గ్రామానికి చెందిన అంశాల స్వామి పేరు తీసుకోవ‌డం స‌ర్వ సాధార‌మైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఫ్లోర్లైడ్ స‌మ‌స్య గురించి తెలిపేందుకు రాజ‌కీయ నాయ‌కులు ఉదాహరణగా అంశాల స్వామి పేరు తీసుకోవడం ప‌రిపాటిగా మారింది. గెలిస్తే ఫ్లోరైడ్‌ను దూరం చేస్తామ‌ని ఎన్నిక‌ల‌ప్పుడు వాగ్దానాలు ఇచ్చిన నాయ‌కులే త‌ప్ప ప‌రిష్కారం మాత్రం ఎవ‌రూ చూప‌లేదు.

ఫ్లోరైడ్ బాధితుల‌ను చూసి చ‌లించిన దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ 'జల సాధన సమితి'ని ప్రారంభించగా, సుభాష్ నేతృత్వంలోని 'ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి'ని ప్రారంభించారు. వీరిద్ద‌రూ క‌లిసి ఫ్లోరైడ్ బాధితుల స‌మ‌స్య‌ల‌ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్కారం చూపాల‌ని ఎన్నో సార్లు అధికారులు వేడుకున్నారు. అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం మాత్రం శూన్యం. ఈ త‌రుణంలో త‌మ స‌మ‌స్య‌ను దేశ ప్ర‌ధాని దృష్టికి తీసుకువెళితే ప‌రిష్కారం వ‌స్తున్నంద‌న్న ఆశతో ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద వంద‌ల మందితో క‌లిసి దీక్ష చేప‌ట్టారు.

అప్ప‌డు రైల్వే మంత్రిగా ఉన్న బండారు ద‌త్తాత్రేయ నాటి ప్ర‌ధాని అట‌ల్ బిహార్ వాజ్‌పేజ్‌తో పోరాటం చేస్తున్న ముగ్గురికి రెండు నిమిషాల పాటు మాట్లాడే అవ‌కాశాన్ని క‌ల్పించారు. ప్రధాని వాజ్ పేయ్ టేబుల్ పై అంశాల స్వామిని కూర్చోబెట్టి సమస్యను వివరించారు దుశ్చ‌ర్ల స‌త్య‌నారాయ‌ణ‌. సమ‌స్య ప‌రిష్కారం కాక‌పోయిన‌ప్ప‌టికీ అప్ప‌టి నుంచి ఫోర్లైడ్ స‌మ‌స్య‌కు ఉదాహ‌ర‌ణ‌గా అంశాల స్వామి పేరు చెప్ప‌డం ప‌రిపాటిగా మారింది.


చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడిన అంశాల స్వామి ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలనే కసితో పని చేస్తూ వచ్చాడు. ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి ఉద్యమ నాయకుడు గత 32 సంవత్సరాలుగా అనేక అంశాలపై పోరాడుతున్నాడు. జిల్లాలో ఫ్లోరైడ్ బాధితుల తరపున తన గళం గట్టిగా వినిపించారు అంశాల స్వామి. ఆయ‌న అభ్య‌ర్థ‌న‌, పోరాటం మేర‌కు తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ఇంటింటికి కృష్ణా నీళ్లు రావ‌డంతో ఫ్లోరైడ్‌పై పోరాటం ఆపారు.

బ్ర‌తుకు దెరువు కోసం చేస్తున్న పోరాడంలో స్వామి ఉపాధి క‌రువైంద‌నే విష‌యాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ రూ.2.7 ల‌క్ష‌ల‌తో సెలూన్‌ను పెట్టించారు. శిథిల‌మై కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో కాలం వెళ్ల‌దీస్తున్నాన‌ని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేయ‌డంతో డ‌బుల్ బెడ్‌రూం ఇంటి నిర్మాణం కోసం మంత్రి రూ.5ల‌క్ష‌లు మంజూరు చేశారు. టీఆర్‌ఎస్ నాయకుడు కర్నాటి విద్యాసాగర్ కూడా స్వామికి తారక రామారావు యొక్క "గిఫ్ట్ ఎ స్మైల్" చొరవ కింద ఇంటిని నిర్మించడంలో సహాయం చేయడానికి ఆర్థిక సహాయం అందించారు.

త‌న జీవితంలో కొత్త ఆశలు నింపిన మంత్రిని ఒక్కసారి చూడాలని, తమ ఊరికి రావాలని స్వామి కోరడంతో మునుగోడు ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా శివన్నగూడెంలోని స్వామి ఇంటికి వెళ్లారు. అతనితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు.

అయితే.. దుర‌దృష్ట వ‌శాత్తు శుక్ర‌వారం రాత్రి ఎలక్ట్రికల్ త్రి వీలర్ ను ఇంటి ర్యాంపు పైకి ఎక్కిస్తుండ‌గా ప్రమాదవశాత్తు స్వామి కింద పడ్డారు. తలకు తీవ్ర గాయమై గాయ‌మైంది. అర్ధరాత్రి వాంతులతో అస్వస్థతకు గురై శ‌నివారం ఉద‌యం మృతి చెందాడు. ఆయ‌న మృతిపై మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. అంశాల స్వామి కుటుంబానికి నా ప్ర‌గాఢ సానుభూతి. అతను ఫ్లోరోసిస్ బాధితుల కోసం పోరాడిన పోరాట యోధుడు. చాలా మందికి ప్రేరణ. అతను ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి." అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.


Next Story