తెలంగాణ విమోచన వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన అమిత్ షా
Amit Shah Kicks Off Telangana Liberation Day Celebrationsబీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది.
By తోట వంశీ కుమార్ Published on 17 Sep 2022 4:49 AM GMTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తుండగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తోంది. కేంద్రం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్స వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కర్ణాటక మంత్రి బి.శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం ప్రకటించాకే కేసీఆర్ దిగొచ్చారు.. బండి సంజయ్
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్‌చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పూలవేసి నివాళుర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బండి సంజయ్ మాట్లాడారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సాహసోపేత నిర్ణయంతోనే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైందన్నారు.
స్వాత్రంత్రం వచ్చిన ఏడాది తరువాత నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని తెలిపారు.నిజాం కాలంలో మహిళలపై జరిగిన అకృత్యాలు అత్యంత ఘోరమైనవన్నారు. సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలోను పటేల్ ప్రారంభిస్తే 17న విముక్తి లభించిందన్నారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందో మహానుభావులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోందని, కేంద్రప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన తరువాత కానీ సీఎం కేసీఆర్ దిగిరాలేదన్నారు. దారుస్సలాం నుంచి అనుమతి లభించాకే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందని ఆరోపించారు.