వైఎస్‌ షర్మిల కారులో ఉండగానే.. క్రేన్‌తో పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

Amid protests, YS Sharmila was forcibly detained by the police.హైదరాబాద్: ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు

By అంజి  Published on  29 Nov 2022 10:30 AM GMT
వైఎస్‌ షర్మిల కారులో ఉండగానే.. క్రేన్‌తో పోలీస్‌స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్: ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను ఈరోజు హైదరాబాద్‌లో పోలీసులుఅరెస్టు చేశారు. సోమవారం నాడు వరంగల్‌లో పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్‌ఎస్ నాయకులు.. ఆమె కాన్వాయ్‌కు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. తన బస్సుపై, పార్టీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్‌కు ముట్టడికి షర్మిల యత్నించింది. అయితే పోలీసులు షర్మిలను అడ్డుకున్నారు.

షర్మిల స్వయంగా కారు నడుపుతూ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి బయలుదేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో యశోద ఆస్పత్రి సమీపంలోని రాజ్‌భవన్‌ రోడ్డులో వైఎస్‌ షర్మిలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వైఎస్ షర్మిల కారులో కిటికీలు మూసి కూర్చున్నారు. ఆమె కారు దిగేందుకు నిరాకరించడంతో క్రేన్ ద్వారా వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును టీఆర్‌ఎస్ నేతలు ధ్వంసం చేశారంటూ చూపించేందుకు వెళ్తున్నానని, తనను ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.

సోమవారం నర్సంపేటలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు వైఎస్‌ఆర్‌టీపీ పాదయాత్రపై దాడి చేశారని, బస్సుపై రాళ్లు రువ్వి, తగులబెట్టారని, పరుష పదజాలంతో, బ్యానర్‌లు, పార్టీ జెండాలను చింపివేశారని షర్మిల అన్నారు. అప్పటి నుంచి తీవ్ర పరిణామాల నేపథ్యంలో వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చి మీడియాతో, పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. అధికార-టీఆర్‌ఎస్ 'దౌర్జన్యాలకు' వ్యతిరేకంగా తన యాత్ర, పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ (టీఆర్‌ఎస్) నేతలు, కార్యకర్తలకు తాను భయపడబోనని, తనకు అండగా నిలిచిన 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పాదయాత్ర చేస్తానని వైఎస్ షర్మిల ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన కొంతమంది వైఎస్‌ఆర్‌టీ పార్టీ నేతలను కూడా పోలీసులు ఈ ఉదయం అరెస్టు చేశారు.

Next Story