గులాబీమయమైన ఖమ్మం
All Arrangements Set for Khammam BRS Party Public Meeting. ఖమ్మం వేదికగా రేపు జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది.
By Nellutla Kavitha Published on 17 Jan 2023 4:27 PM ISTఖమ్మం వేదికగా రేపు జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. సభకు 5 లక్షల మందిని సమీకరించేలా, వారం రోజుల నుంచి సభలు, సమావేశాలు, సన్నాహక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పార్టీ నేతలు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ వెనక భాగంలోని 100 ఎకరాల్లో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా మహబూబాబాద్, సూర్యాపేట, ఇతర నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు నేతలు.
రేపు ఖమ్మం లో జరిగే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హాజరు కాబోతున్నారు. వీరంతా ఈరోజు రాత్రి వరకే హైదరాబాదుకి చేరుకుంటారు. బుధవారం ఉదయం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ తో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి 2 హెలికాప్టర్లలో బయలుదేరి యాదాద్రి కి చేరుకుంటారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని ఖమ్మం బయలుదేరతారు. కంటి వెలుగు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో అతిథులంతా పాల్గొని ఆ తర్వాత బహిరంగ సభకు చేరుకుంటారు.
భారత రాష్ట్ర సమితి బహిరంగ సభ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు జరగనుంది. 100 ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుంటే 480 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు నేతలు. సభకు 5 లక్షల మంది వస్తారని టార్గెట్ పెట్టుకున్నందున, వారి కోసం 50 ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఆవిర్భావ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తుండడంతో ఖమ్మం గులాబీ మయంగా మారింది. రోడ్లకి ఇరువైపులా తోరణాలు, భారీ కటౌట్లు హోర్డింగులతో నిండిపోయింది. ఒకవైపు జాతీయ స్థాయి నేతలు, మరొకవైపు ప్రాంతీయ పార్టీ టిఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ సభ, దీంతో పాటుగానే ఏపీ, చత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దుల్లో ఉన్న ఖమ్మంలో ఈ సభ జరుగుతుండడంతో దీనికి జాతీయస్థాయిలో ప్రాధాన్యత పెరుగుతుందని భావిస్తున్నారు నేతలు.
ఖమ్మంలో జరగబోతున్న టిఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేతలు. దేశానికి దశ దిశ చూపించేలా కేసీఆర్ ప్రసంగం ఉండబోతుందని అంటున్నారు. దేశం చూపు ఖమ్మం వైపు ఉందని, ఈ సభతో దేశ రాజకీయాల్లో పెను మార్పు వస్తుందని గులాబీ నేతలంటున్నారు. సభలో ముఖ్య అతిథుల ప్రసంగం తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని గులాబీ నేతలు చెప్తున్నారు.
ఖమ్మంలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం, దీంతోపాటుగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ … ఈ మూడు కార్యక్రమాలు పెద్ద ఎత్తున రేపు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపు నలుగురు ముఖ్యమంత్రులు, ఇతర కీలక అతిధులు ఖమ్మం లో పర్యటించబోతున్నారు. నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, జాతీయ నాయకులు రేపు ఖమ్మం లో పర్యటిస్తున్న సందర్భంగా 9 మంది ఐపీఎస్ ల పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగనుంది.