ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు.
By అంజి Published on 28 March 2024 11:07 AM ISTప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలన్న సజ్జనార్
ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులకు అలర్ట్.. డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ పోలీసులు ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులనే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో పాటు పంజాబ్ నేషనల్ బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్లు చేసి కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. సోషల్ మీడియా సాయంతో బ్యాంక్ ఏజెంట్లను నియమించుకుని.. బ్యాంకు ఖాతాల్లో ఎక్కువగా డబ్బున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. అక్రమ లావాదేవీలు చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారు. కావున ప్రైవేట్ బ్యాంకుల ఖాతాదారులు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
''భారీ మొత్తంలో నగదు బదిలీకి బ్యాంకు కరెంట్ ఖాతాలను ఉపయోగించుకోవాలి. అవసరమైతేనే ఒక్కటి రెండు సార్లు ధృవీకరించుకున్నాకే కార్పొరేట్ లాగిన్ లు తెరవాలి. కార్పొరేట్ లాగిన్‌ల సాయంతో పెద్ద మొత్తంలో సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసే అవకాశముంది.. జాగ్రత్త! విదేశాల నుండి ఇండియా బ్యాంక్ ఖాతాలకు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పూర్తిగా నిషేధించాలి. ముఖ్యంగా చైనా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాలి'' అని అన్నారు.
డ్రగ్ పార్శిళ్ల పేరుతో మోసాలు ఎక్కువగా దుబాయ్ కేంద్రంగా పనిచేస్తోన్న కాల్ సెంటర్ల నుంచి జరుగుతున్నాయి. టెలిగ్రామ్ ద్వారా భారతీయులను రిక్రూట్ చేసుకుని.. వారి సాయంతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడుతున్నారు. తైవాన్, థాయిలాండ్, కంబోడియా దేశాల నుంచి డ్రగ్ పార్శిల్ ఫ్రాడ్స్ జరుగున్నాయి. డ్రగ్ పార్శిళ్ల పేరుతో ప్రపంచంలో జరుగుతున్న మొత్తం మోసాల్లో 90 శాతం భారతదేశంలోనే సంభవిస్తుండం గమనార్హం.
''ఈ మోసాలకు చెక్ పెట్టాలంటే స్వీయ అవగాహన కలిగిఉండటం ఒక్కటే మార్గం. అజ్ఞాత వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తే అసలే స్పందించవద్దు. పోలీసులమని అని చెప్పగానే భయపడి పోయి వారు చెప్పినట్లు చెయొద్దు. నగదును ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చెయొద్దు. ఒకవేళ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి'' అని సజ్జనార్ సూచించారు.