వాసాలమర్రిలో 18 మందికి అస్వస్థత
Akula Agavva hospitalised after meals with KCR.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తాను దత్తత తీసుకున్న
By తోట వంశీ కుమార్ Published on 25 Jun 2021 4:59 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తాను దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా వాసాల మర్రిలో పర్యటించిన సంగతి తెలిసిందే. అక్కడ సీఎం కేసీఆర్ ఆ గ్రామ ప్రజలతో సహపంక్తి భోజనం చేశారు. సీఎంతో సహపంక్తి భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. కాగా.. కేసీఆర్ పక్కనే కూర్చొని భోజనం చేసిన వృద్దురాలు ఆకుల ఆగమ్మ సభ పూర్తి అయ్యాక బయటకు వస్తూ వాంతులు చేసుకున్నారు. రాత్రి కూడా వాంతులు, విరేచనాలు కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను భువనగిరి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో గురువారం ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.
బుధవారం ఓ బాలిక అస్వస్థతకు గురి కావటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం అదే రోజు ఇంటికి పంపారు. అయితే.. ఆ గ్రామంలో మరో 16 మంది వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధ పడుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. బుధవారం ఇంటింటా తిరిగి అనారోగ్యానికి గురైన వారికి మెరుగైన వైద్యం అందించినట్లు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వైద్యాధికారి సీహెచ్.చంద్రారెడ్డి తెలిపారు. అయితే.. వారి అస్వస్థతకు గురికావడానికి కలుషిత ఆహారం కాదని పేర్కొన్నారు. సహపంక్తి భోజనంలో 2500 మంది పాల్గొనగా.. 18 మంది మాత్రమే అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. వారు తీసుకున్న ఆహారం పడక వాంతులు, విరేచనాలు అయి ఉంటాయన్నారు.