Hyderabad: పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ఎఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరించారు.

By అంజి  Published on  22 Nov 2023 5:32 AM GMT
AIMIM,  Akbaruddin Owaisi, Hyderabad, Telangana Elections 2023

Hyderabad: పోలీసులను బెదిరించిన అక్బరుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ప్రవర్తనా నియమావళిని పాటించాలని కోరిన పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం బహిరంగంగా బెదిరించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం.. సమయం మించిపోతున్నందున తన ప్రసంగాన్ని ఆపాలని కోరడంతో అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసులను బెదిరించారు.

నిన్న హైదరాబాద్‌లోని లలితాబాగ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను ఎఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరారు. తన మద్దతుదారునికి "సిగ్నల్" ఇస్తే.. ఇన్‌స్పెక్టర్ ఆ స్థలం నుండి "పరిగెత్తవలసి వస్తుంది" అని సూచిస్తూ, వేదిక నుండి "వెళ్లిపో" అని పోలీసును అక్బరుద్దీన్ బెదిరించారు.

''కత్తులు, బుల్లెట్లను ఎదుర్కొన్న తర్వాత, నేను బలహీనపడ్డాను అని మీరు అనుకుంటున్నారా, ఇప్పటికీ నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉంది. నేను ఐదు నిమిషాలు ప్రసంగిస్తాను, ఎవరూ నన్ను ఆపలేరు. నేను సిగ్నల్ ఇస్తే, మీరు పరుగెత్తాలి, మనం అతన్ని పరిగెత్తించాలా? మమ్మల్ని నిర్వీర్యం చేసేందుకే వాళ్లు ఇలా వస్తున్నారని నేను చెబుతున్నా'' అని అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు.

చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి అక్బరుద్దీన్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి కావడం గమనార్హం. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో - 2014, 2018లో ఈ సెగ్మెంట్ నుండి పార్టీ విజయం సాధించడంతో ఈ స్థానం ఏఐఎంఐఎంకి బలమైన కోటగా ఉంది.

తెలంగాణాలో నవంబర్ 30న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. రాష్ట్రంలో బీజేపీ, అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా పిలువబడే భారత రాష్ట్ర సమితి (BRS) మొత్తం 119 సీట్లలో 88 సీట్లను గెలుచుకుంది, మొత్తం ఓట్ల షేర్‌లో 47.4 శాతం సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

Next Story