తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కుమారుడు?

కుమారుడు డా. నూరుద్దీన్‌ ఒవైసీని ఎన్నికల బరిలో దింపాలని అక్బరుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  3 July 2023 11:13 AM IST
AIMIM, Akbaruddin Son, Nooruddin, Telangana, Elections,

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ కుమారుడు?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో నాయకుల తీరు అల్లకల్లోలం చేస్తోంది. ఇక కాంగ్రెస్‌ ఇదే అదునుగా మరింత బలపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కుమారుడు డాక్టర్‌ నూరుద్దీన్‌ ఒవైసీని ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

డాక్టర్‌ నూరుద్దీన్‌ను ఒవైసీ కుటుంబం చారిత్రక ప్రాధాన్యత కలిగిన చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించే అవకాశం ఉంది. అయితే.. చార్మినార్ నియోజకవర్గం నుంచే నూరుద్దీన్ తాత సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, మామ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగారు. గత 40 ఏళ్లుగా చార్మినార్‌ నియోజకవర్గానికి ఎంఐఎం ప్రాతినిథ్యం వహిస్తోంది. ప్రస్తుతం చార్మినార్‌ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఉన్నారు.

కాగా.. గత 2018 ఎన్నికల్లోనే నూరుద్దీన్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ ఒవైసీలు భావించారు. కానీ వయసు రీత్యా అప్పుడు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ.. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో నూరుద్దీన్‌ ఒవైసీని కచ్చితంగా ఎమ్మెల్యే పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూరుద్దీన్‌ గనుక రాజకీయాల్లోకి వస్తే ఒవైసీ కుటుంబం నాలుగో తరంలోకి ప్రవేశిస్తుంది. 1957లో అసదుద్దీన్‌ ఒవైసీ తాత అబ్దుల్‌ వహీద్ ఒవైసీ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 1975లో అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సుల్తాన్‌ సలావుద్దీన్‌ అధికారంలోకి వచ్చారు. 2008లో అసదుద్దీన్‌ ఒవైసీ తమ కుటుంబం నుంచి ఎంఐఎం మూడో అధ్యక్షుడయ్యారు.

కాగా.. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌గా పిలుస్తోన్న టీఆర్ఎస్ 88 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అక్బరుద్దీన్‌ కుమారుడిని బరిలోకి దింపడమే కాకుండా.. వచ్చే ఎన్నికల్లో ఓల్డ్‌ సిటీ వెలుపల పోటీ చేయాలని భావిస్తోంది ఎంఐఎం. మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా.. కనీసం 50 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని గతంలో అక్బరుద్దీన్‌ ఒవైసీ కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. మరి ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

Next Story