హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందుకోసం అమెరికాకు చెందిన ఐటీ సర్వ్ అలయన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించారు. తొలి విడతలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాలకు విస్తారిస్తామన్నారు. ఆయా జిల్లాల్లో స్థానికులకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, 30 వేల ఐటీ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
బుధవారం నాడు తెలంగాణ సచివాలయంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సమక్షంలో అమెరికాకు చెందిన పలు కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. టైర్ -2, టైర్-3 పట్టణాల్లో రానున్న రోజుల్లో 30 వేల కొత్త ఉద్యోగాలను ఇచ్చేలా ప్రభుత్వంతో ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఈ ఎంవోయూను మంత్రి శ్రీధర్ బాబు స్వాగతించారు. ఈ ఎంవోయూ కొత్త ఉద్యోగాలను సృష్టించడం మాత్రమే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీ రంగాన్ని శక్తివంతం చేస్తుందన్నారు. తమకు ఈ అవగాహన ఒప్పందం చాలా కీలకమైనదని ఐటీ సర్వీస్ అలయన్స్ జాతీయ అధ్యక్షుడు జగదీష్ మొసలి అన్నారు.