తెలంగాణ సర్కార్ శుభవార్త.. వారికి రూ.10 లక్షల ప్రమాద బీమా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
By అంజి Published on 15 March 2024 1:10 AM GMTతెలంగాణ సర్కార్ శుభవార్త.. వారికి రూ.10 లక్షల ప్రమాద బీమా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీనిధి పరపతి సమాఖ్య ద్వారా బీమా అమలు కానుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో పాటు ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమాను కల్పిస్తూ జీవో జారీ చేసింది. మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకునే రూ.2 లక్షల వరకు రుణాలకు బీమా (రిస్క్ కవరేజ్) కోసం స్త్రీనిధి సమాఖ్యకు రూ.50.41 కోట్లు విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. రెండు రోజుల కిందట జరిగిన స్వశక్తి మహిళా సదస్సులో ఇచ్చిన హామీ అమలోకి తేవడానికి ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా శిల్పారామం పక్కన ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మంత్రి పొంగులేటి, ఇతర అధికారులతో కలిసి గురువారం స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 2017 నుంచి నిరుపయోగంగా ఉన్న నైట్ బజార్‌లోని 119 స్టాల్స్‌ను మార్కెటింగ్ చేసుకునేలా అన్ని రకాల సదుపాయలతో సిద్ధం చేయాలని చెప్పారు.
మహిళా సంఘాల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా నెల రోజుల్లోగా శిల్పారామం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని ఈ నెల 12న జరిగిన స్వయం సహాయక సంఘాల రాష్ట్ర స్థాయి సదస్సులో హామీ ఇచ్చారు. రైతు బజారుల తరహాలో స్టాల్స్‌ను తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.
స్టాల్స్ పూర్తిగా మహిళలకు మాత్రమే కేటాయించాలని, ఇందుకు సంబంధించి వీలైనంత తొందరగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు. ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. మహిళా శక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.