తెలంగాణ పోలీస్ శాఖలో హోమ్ గార్డు నుండి ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి, జవాబుదారీతనంతో పనిచేయాలని డీజీపీ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో ఉంటూ ప్రజలకు స్నేహపూర్వక సేవలందించాలని ఆయన 'X' వేదికగా స్పష్టం చేశారు.
అయితే, డీజీపీ హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలోనే వరుసగా పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌స్పెక్టర్ కనకయ్య, ఎస్సై సిద్ధేశ్వర్ ఒక కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు, కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
ఇందులో భాగంగా రూ. 2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, ఎవరైనా లంచం అడిగితే వెంటనే 1064 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని డీజీపీ సూచించారు.