రోజురోజుకీ అవినీతిపరులు పెరిగిపోతున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు చేసి లంచగొండిలను అరెస్టు చేస్తున్న కూడా మరోవైపు అవినీతిపరులు తమ పద్ధతి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణం తహశీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న రజిని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ అధికారుల సోదాలతో స్థానికంగా కలకలం రేగింది. జమ్మికుంట తహశీల్దార్ ఇంటిపై ఏసీబీ అధికారులు బుధవారం ఉదయం నుండి సోదాలు కొనసాగించారు. హన్మకొండలోని కేఎల్‌ఎన్ రెడ్డి కాలనీలోని ఆమె నివాసంతో పాటు, బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు చేస్తోంది.
హనుమకొండ జిల్లాలో ఏసీబీ అధికారులకు మరో తిమింగలం దొరికింది. దీంతో రంగంలోకి దిగి ఏకకాలంలో పలువురు ఇళ్ళలో సోదాలు కొనసాగించారు. రజిని అనే మహిళ కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో తహసిల్దార్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమెపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు అయింది. రజిని అధికారాన్ని అడ్డుపెట్టుకొని పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లుగా ఆరోపణలు అందడం, ఆమెపై కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఉదయం నుండి రజిని ఇంటితో పాటు ఆమె బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగించారు. భూములకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.