Telangana: ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థ.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం
రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను త్వరలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు.
By అంజి
Telangana: ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థ.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మరింత సులభం
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్లకు ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను త్వరలో అమలు చేయనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు. దీని వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 15 నిమిషాల్లో పూర్తవుతుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పైలట్ ప్రోగ్రామ్‌గా ఈ కొత్త వ్యవస్థను వెంటనే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను వీలైనంత త్వరగా అమలు చేయాలని శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జూన్ 2 నుండి రాష్ట్రం అంతటా స్లాట్ బుకింగ్ వ్యవస్థ అమలు, అధిక పనిభారం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్లను నియమించడంపై సోమవారం సచివాలయంలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్లాట్ బుకింగ్ వ్యవస్థతో పాటు, ఆధార్ ఈ-సిగ్నేచర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా స్లాట్ బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నందున ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పటాన్‌చెరు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్ట్రార్‌లను నియమించారు. అవినీతికి దూరంగా ఉంచే విధంగా, ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా, ప్రభుత్వ ఖ్యాతిని పెంచే విధంగా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.