Medak: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు
టమాటా ధరలు రికార్డులు సృష్టిస్తోన్నాయి. ఎప్పుడూ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే టమాటాలకు ఇప్పుడు రెక్కొలొచ్చాయి.
By అంజి Published on 23 July 2023 7:07 AM ISTMedak: ఆ టమాటా రైతు ఇప్పుడు కోటీశ్వరుడు
టమాటా ధరలు రికార్డులు సృష్టిస్తోన్నాయి. ఎప్పుడూ మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే టమాటాలకు ఇప్పుడు రెక్కొలొచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన ఓ రైతు టమాటా సాగు చేసి కోటీశ్వరుడయ్యాడు. రైతు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. సుడి అంటే ఆయనదే అంటున్నారు. టమాటా ధర రికార్డు స్థాయిలో పలుకుతుండటం. ఆయన సాగు చేసిన పంట చేతికి రావడం కలిసొచ్చింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్‌నగర్‌కు చెందిన రైతు మహిపాల్‌రెడ్డి.. ఇప్పటి వరకు రూ.1.84 కోట్ల లాభం ఆర్జించాడు.
8 ఎకరాల్లో టమాటా పంటను సాగు చేసిన మహిపాల్ రెడ్డి.. రోజుకూ 250 బాక్సులు అమ్ముతున్నాడు. సమ్మర్‌లో టమాటా పండించాలన్న తపన ఆయనలో ఎప్పటి నుంచో ఉంది. సమ్మర్‌లో తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి టమాటా ఎక్కువగా దిగుమతి అవుతుంటుంది. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే నెలల్లో టమాటా పండించాలనే పట్టుదలతో సాగు చేశాడు. ఇందు కోసం రూ.30 లక్షలకుపైనే పెట్టుబడి పెట్టాడు. టమాటా క్వాలిటీగా ఉండటంతో వ్యాపారులు ఎక్కువ డబ్బులు పెట్టీ మరీ కొనుగోలు చేస్తున్నారు.
రైతు మహిపాల్ రెడ్డి.. ఇప్పటికే రూ.1.84 కోట్ల విలువైన టమాట అమ్మగా.. ఇంకా రూ.1.80 కోట్ల పంట మిగిలి ఉందని తెలిపారు. రేటు తగ్గినా కూడా కోటి రూపాయల పంట వస్తుందని, పంట బాగా ఉండటంతో రోజూ డీసీఎం, ట్రక్కుల్లో మార్కెట్‌కు తరలిస్తున్నానని చెప్పాడు. మహిపాల్ రెడ్డికి సొంతూరులో 20 ఎకరాల భూమి ఉంది. దీనికి అదనంగా కౌడిపల్లిలో 55 ఎకరాలు.. ముట్రాజిపల్లిలో 25 ఎకరాల్ని కౌలుకు తీసుకొని వివిధ పంటల్ని సాగు చేస్తున్నాడు. మిగిలిన రైతుల మాదిరి కాకుండా పంట సాగులో భిన్నత్వంతో పాటు.. కొత్త తరహా మార్కెటింగ్ వ్యూహాలతో ముందుకు వెళుతున్నాడు.