సింగరేణి కాలరీస్, నైని కోల్ బ్లాక్ వ్యవహారాల్లో జరిగిన అవకతవకలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ సమానంగా బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రా రావు ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మరిచిందని విమర్శించారు. సింగరేణి దేశంలోనే అత్యధిక లాభాలు ఆర్జించిన సంస్థగా ఉండేదని, కానీ రాజకీయ జోక్యాలతో దానిని నష్టాల బాట పట్టించారని అన్నారు. ఒకప్పుడు 75 వేల మంది ఉద్యోగులు పనిచేసిన సింగరేణిలో, బీఆర్ఎస్ పాలన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేలకే పడిపోయిందని, ప్రస్తుతం అది 38 వేలకు తగ్గిందని తెలిపారు.
నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి సంస్థ ద్వారా గతంలో రూ.10 కోట్ల స్పాన్సర్‌షిప్‌లు ఎలా ఇచ్చారో ప్రజలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నైని కోల్ బ్లాక్ టెండర్లు ఎందుకు రద్దు చేశారో, ముందుగా ఎవరికి ఇచ్చారో, ఎంత కమిషన్లు పంచుకున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పాలని అన్నారు. సింగరేణిలో 49 శాతం కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నా, పరిపాలన మొత్తం రాష్ట్ర ప్రభుత్వాధీనంలోనే ఉందని, కేంద్రానికి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదని వివరించారు. అయినప్పటికీ సింగరేణి పేరుతో రాజకీయ నేతలు, వారి అనుచరులు కోట్ల రూపాయల కమిషన్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు.
సింగరేణి, నైని బ్లాక్ మాత్రమే కాకుండా గత బీఆర్ఎస్ పాలన నుంచి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ కాలం వరకు జరిగిన అన్ని కోల్ బ్లాక్ టెండర్లపై సీబీఐ, సిట్ లేదా విజిలెన్స్ కమిషన్‌తో సమగ్ర విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని చెప్పారు. కార్మికుల రక్తం, చెమటతో నడిచిన సింగరేణిని రాజకీయ పార్టీల ఏటీఎంగా మార్చారని విమర్శించారు.