'నాకు లంచం వద్దు'.. తెలంగాణలో ఓ ఆర్ఐ నిజాయితీ.. ఐడీ కార్డుతో వినూత్న ప్రచారం
A Revenue employee is making an innovative campaign in Huzurabad.జేబుకు 'నాకు లంచం వద్దు ప్లీజ్' అని ఐడీ కార్డును
By తోట వంశీ కుమార్ Published on 15 Sept 2022 9:56 AM ISTప్రభుత్వం సమయానికి జీతం ఇస్తున్నా కొందరు అధికారులు మాత్రం లంచాలకు అలవాటు పడి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారు. పైసా లేనిదే పనులు చేయమని బాహాటంగా చెప్పిన ఘటనలు మనం గతంలో చూశాం. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా వాళ్లల్లో మార్పు రావడం లేదు. అన్ని శాఖల్లో ఎలా ఉన్నా రెవెన్యూ శాఖ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ కార్యాలయంలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు లంచం లేనిదే పనులు చేయరనే అపవాదను మూటకట్టుకుంటున్నారు.
ఓ రెవెన్యూ ఉద్యోగి అలాంటి అధికారులకు చెంపపెట్టుగా నిలిచారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం పాలకీడు మండలంలో చిలుకరాజు నర్సయ్య ఆర్ఐగా పని చేస్తున్నారు. బుధవారం ఆయన కారాలయ్యానికి వచ్చేటప్పుడు తన జేబుకు 'నాకు లంచం వద్దు ప్లీజ్' అని ఐడీ కార్డును పెట్టుకుని వచ్చి విధులు నిర్వర్తించారు. ఈ విషయం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో చర్చనీయాంశమైంది.
ఇలా పెట్టుకురావడానికి గల కారణం ఏంటని ఆయన్ని అడుగగా.. రెవెన్యూ ఉద్యోగులు అనగానే అవినీతికి పాల్పడేవారిగానే చూస్తున్నారని, తాను లంచం తీసుకోకున్నా.. తనను అదే కోవకు చెందిన వాడిగా చూస్తున్నారని వాపోయారు. అందుకనే 'నాకు లంచం వద్దు' అనే ఐడీ కార్డును జేబుకు పెట్టుకున్నట్లు తెలిపారు.
వాస్తవానికి.. తెలంగాణలో రెవెన్యూ శాఖపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి ఎక్కువ అనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అదే శాఖలో పనిచేస్తున్న నర్సయ్య చేసిన పని అందరినీ ఆకట్టుకుంది. రెవెన్యూ శాఖలో అందరూ అవినీతి పరులు కారని, కొందరు తనలా నిజాయితీగా పని చేస్తారని ఆయన నిరూపించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందరూ నర్సయ్య లా ఉండాలని నెటీజన్లు కామెంట్లు పెడుతున్నారు.