అరుదైన పుట్టగొడుగు తెలంగాణలో కనపడితే..!

కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అరుదైన, విలక్షణమైన ఆల్-బ్లూ మష్రూమ్ జాతిని ఇటీవల కనుగొన్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 July 2023 2:55 AM GMT
అరుదైన పుట్టగొడుగు తెలంగాణలో కనపడితే..!

కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అరుదైన, విలక్షణమైన ఆల్-బ్లూ మష్రూమ్ జాతి (శాస్త్రీయ పేరు: ఎంటోలోమా హోచ్‌స్టెట్టెరి)ని ఇటీవల కనుగొన్నారు. ఇది తెలంగాణలో కనపడడం ఇదే మొదటిసారి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గుర్తించారు. ఇది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనిపించింది. ఇది "బ్లూ పింక్ గిల్" లేదా "స్కై-బ్లూ మష్రూమ్" గా పిలుస్తారు. ఈ జాతి పుట్టగొడుగులు గులాబీ, ఊదా రంగులను కలిగి ఉంటాయి. జూలై 20న ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖాధికారులకు ఈ పుట్టగొడుగులు కనిపించాయి. 1989లో ఒడిశాలో బ్లూ పింక్‌గిల్ మష్రూమ్ భారతదేశంలో మొదటిసారిగా కనిపించినప్పుడు అందరూ ఆశ్చర్యపొయారు.

కాగజ్‌నగర్ అటవీ రేంజ్ అధికారి ఎస్ వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం, ఎప్పటిలాగే అధికారులు అడవిలో తిరుగుతూ ఉండగా ఈ మష్రూమ్ ను కనుక్కోవడం జరిగిందని తెలిపారు. నీలం, ప్రత్యేకమైన రూపం అందరి దృష్టిని ఆకర్షించింది.. వారు ఆ చిత్రాన్ని నాకు పంపారని వేణుగోపాల్ చెప్పారు. ఇది కేవలం అద్భుతమైన రంగు మాత్రమే కాకుండా, దాని ప్రవర్తన కూడా. బ్లూ పింక్‌గిల్ మష్రూమ్ రాత్రిపూట మెరుస్తుందని తెలిపారు.

ఏయే దేశాల్లో కనిపిస్తాయంటే:

న్యూజిలాండ్ నుండి ఉద్భవించిన ఈ జాతి ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఆ దేశ నోటుపై కూడా ఈ పుట్టగొడుగు చిత్రాన్ని ఉంచారు. న్యూజిలాండ్ దేశపు $50 నోటు మీద ఇది కనిపిస్తుంది. ఇది ఆ దేశ జాతీయ ఫంగస్‌గా కూడా గుర్తించారు. దీని ఎడిబిలిటీకి సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేనప్పటికీ, సాధారణంగా ప్రకృతిలో ఆకర్షణీయమైన రంగులలో ఉన్నవి విషపూరితమైనవి కూడా కావచ్చని వేణుగోపాల్ హెచ్చరించారు. "బ్లూ పింక్‌గిల్ మష్రూమ్ వర్షాకాలంలో కనిపిస్తుంది, ఈ సమయంలో పుట్టగొడుగులు వృద్ధి చెందడానికి సరైన నేల, వాతావరణం ఉంటుంది." అని తెలిపారు. ఈ పుట్టగొడుగు ఎంతో అరుదైనది.. దానిని రక్షించడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని పరిస్థితులు దాని మనుగడపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. అటవీ వ్యవస్థను రక్షించడం మా మొదటి ప్రాధాన్యత, ఇవి మరిన్ని కనిపిస్తే ఈ అరుదైన జాతిని అర్థం చేసుకోవడంలో మనం లోతుగా పరిశోధించవచ్చని అన్నారు.

తెలంగాణ బయోడైవర్సిటీకి క్రెడిట్ దక్కుతుంది:

తెలంగాణలో బ్లూ పింక్‌గిల్ పుట్టగొడుగులు కనిపించడం ఈ ప్రాంతం జీవవైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. నిపుణులు, ప్రకృతి ఔత్సాహికులు అడవిలో ఈ అరుదైన పుట్టగొడుగు ఉనికిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సిద్దిపేటలోని ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లోని ఫారెస్ట్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జగదీష్ బత్తుల ఈ పుట్టగొడుగులు, వాటి రూపాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. "ఎంటోలోమా హోచ్‌స్టెటెరి అనేది ప్రపంచవ్యాప్తంగా కనిపించే మనోహరమైన, విభిన్నమైన పుట్టగొడుగుల సమూహం. అవి వివిధ రంగులు, ఆకారాలకి వస్తాయి. విభిన్న ప్రాంతాలలో పెరుగుతాయి. వాటి గులాబీ, ఊదారంగు మొప్పల కారణంగా 'బ్లూ పింక్ గిల్స్' లేదా 'స్కై బ్లూ పుట్టగొడుగులు' అని పిలుస్తారు. కొన్ని చిన్నవిగా విలక్షణమైన రంగులలోనూ ఉండడానికి అజులీన్ పిగ్మెంట్లు కారణం. వాటి ప్రత్యేకమైన రంగుల కారణంగా తొందరగా గుర్తించడానికి వీలు అవుతుంది" అని డాక్టర్ జగదీష్ చెప్పారు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా చక్కెరలకు బదులుగా పోషకాలను ఉత్పత్తి చేయడం మైకోరైజల్ జాతుల ప్రత్యేకత అని అన్నారు. పుట్టగొడుగుల కారణంగా చెట్లకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రక్రియ మొత్తం పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సాప్రోట్రోఫిక్ ఎంటోలోమా జాతులు చనిపోయిన మొక్కలు, జంతు పదార్థాలను విచ్ఛిన్నం చేస్తాయి, పోషకాల సైక్లింగ్, నేల సుసంపన్నతకు దోహదం చేస్తాయి. ఇవి ఎంత విషపూరితమైనవో తెలియనప్పటికీ.. తినకుండా ఉండటం చాలా మంచి నిర్ణయమని తెలిపారు. ఎంటోలోమా జాతులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ , యాంటీమైక్రోబయల్ లక్షణాలతో కూడిన బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉన్నాయని ప్రాథమిక రసాయన విశ్లేషణలు తెలిపాయి. వివిధ వ్యాధుల కోసం కొత్త ఔషధాలను అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ జగదీష్ తెలిపారు.

Next Story