నిర్మల్ జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో కోతి కళేబరం లభ్యమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నీరు దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ట్యాంక్ లోపలికి చూసి కోతి కళేబరాన్ని చూసి నివ్వెరపోయారు. వారం రోజులుగా కలుషిత నీటిని సరఫరా చేయడంపై గ్రామస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంక్ నుంచి కోతి కళేబరాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత సిబ్బంది వాటర్ ట్యాంకును శుభ్రం చేశారు.
అయితే కోతి కళేబరం ఉన్న నీటిని తాగిన గ్రామస్తులు భయపడుతున్నారు. తమకు ఎలాంటి రోగాలు సోకుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు. కోతులు నీటి కోసం ప్రయత్నించి ట్యాంకులో పడిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది నల్లగొండ జిల్లా నందికొండ పట్టణంలో తాగునీటిని సరఫరా చేసే ట్యాంక్‌లో 30 కోతుల కళేబరాలు వెలుగుచూశాయి. సిబ్బంది ట్యాంక్‌లోకి దిగి కోతుల కళేబరాలను వెలికితీశారు. ఎండ తీవ్రత కారణంగా నీళ్లు తాగేందుకు వచ్చిన కోతులు ట్యాంక్‌లోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాయి.