భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఆరంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలు తొలగిస్తేనే కానీ ప్రమాద తీవ్రతను చెప్పలేమని అధికారులు తెలిపారు.
బిల్డింగ్ కుప్పకూలిపోవడానికి నాణ్యతా లోపమే అని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో అందులో పనిచేస్తున్న కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సమీప ఇళ్లలోని ప్రజలు ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు.