గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో హైదరాబాద్‌కు చెందిన మావోయిస్టు నేత హతం
By Knakam Karthik Published on 23 Jan 2025 10:30 AM ISTగరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో హైదరాబాద్‌కు చెందిన మావోయిస్టు నేత హతం
ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో మావోయిస్టు కీలక నేత మరణించినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. మంగళవారం భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మరణించిన మావోయిస్టులలో తెలంగాణకు చెందిన సీనియర్ మావోయిస్టు నాయకుడు అల్వాల్ ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎదురుకాల్పుల్లో మృతి చెందినట్లు ప్రకటించాయి. ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్‌చార్జ్‌గా చంద్రహాస్ పనిచేస్తున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. కాగా మృతి చెందిన మావోయిస్టు ప్రమోద్ అలియాస్ చంద్రహాస్‌పై రూ.20 లక్షల రివార్డు ఉంది. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ జవహర్‌నగర్‌కు చెందిన చంద్రహాస్ 1985 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం.
కాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా ఫారెస్ట్ ఏరియాలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. కోబ్రా బెటాలియన్, సీఆర్పీఎఫ్ బెటాలియన్ జాయింట్ ఆపరేషన్‌లో సుక్మా జిల్లాలోని మెటగూడెం, దులేర్ గ్రామాల మధ్య పేలుడు పదార్థాలు, ఆయుధాల తయారీ సామాగ్రిని వెలికి తీశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లను అనుసరించి భద్రతా బలగాలు ఆపరేషన్ నిర్వహించాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాల్లో ఐఈడీలు, మల్టిపుల్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్లు ఉన్నట్లు ప్రకటించారు.