తెలంగాణ సచివాలయాన్ని పేల్చేస్తామన్న బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. మూడు రోజుల నుంచి తెలంగాణ సెక్రటేరియట్ పేల్చివేస్తామంటూ ఫోన్ కాల్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. అసలు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడని తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఆ వ్యక్తిని అదుపులోకి కూడా తీసుకున్నారు. సచివాలయంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. అయితే విచారణ సందర్భంగా సదరు వ్యక్తి చెప్పిన మాటలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
దర్గాకు సంబంధించి ఓ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి తాను దరఖాస్తు పెట్టుకున్నట్లు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి పోలీసుల విచారణలో చెప్పాడు. అధికారులు ఏ మాత్రం తన సమస్యపై పట్టించుకోకపోవడంతోనే ఫోన్ కాల్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పాడు. కాగా అదే తెలంగాణ సచివాలయంలో ఫోన్ చేసిన వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అసలు ఫోన్ ఎందుకు చేశాడు. ఇంకా ఏదైనా కారణముందా అనే కోణంలో విచారిస్తున్నారు.