తెలంగాణలో భారీగా స్కూల్ బస్సుల సీజ్

తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్, సరైన పర్మిట్ పత్రాలు లేని పాఠశాలల బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు.

By అంజి  Published on  13 Jun 2024 9:54 AM IST
school buses seized, Hyderabad, fitness, permit paperwork

తెలంగాణలో భారీగా స్కూల్ బస్సుల సీజ్

తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్, సరైన పర్మిట్ పత్రాలు లేని పాఠశాలల బస్సులను ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఆధ్వర్యంలో జూన్ 13 బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించి మొత్తం 86 బస్సులను సీజ్ చేశారు. సీజ్ చేసిన మొత్తం బస్సుల్లో హైదరాబాద్ జిల్లాకు చెందినవి 25, రంగారెడ్డి జిల్లాకు చెందినవి 46, మేడ్చల్‌ కు చెందినవి 15 బస్సులు ఉన్నాయి. తనిఖీల్లో చాలా బస్సులు రోడ్డెక్కడానికి ఫిట్నెస్ లేనివని, కొన్నింటికి అవసరమైన లైసెన్సులు లేవని, పన్ను చెల్లించనివి కూడా కొన్ని ఉన్నాయని అధికారులు గుర్తించారు.

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. జూన్ 11న రవాణా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి ప్రభాకర్. సరైన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా పాఠశాల బస్సులను రోడ్ల మీదకు రానివ్వకూడదని మంత్రి పొన్నం సూచించారు. వాహనదారులకు, ప్రజలకు అన్ని విషయాలను తెలియజేసేందుకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Next Story