తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య మరింత పెరిగింది. గడిచిన 24 గంటల్లో 70,961 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. కొత్తగా 6,876 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,63,361కి చేరింది. నిన్న ఈ మహమ్మారి కారణంగా 59 మంది మరణించారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,476కి చేరింది. నిన్న 7,432 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,81,365కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 82.30శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.53శాతంగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,029 వెలుగు చూశాయి. ఆ తరువాత మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 502, రంగారెడ్డి జిల్లాలో 387 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.