మార్చి నాటికి తెలంగాణలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ విద్యుత్
500 Govt schools in Telangana to have solar power by March. హైదరాబాద్: రాష్ట్రంలోని 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి నాటికి సౌర విద్యుత్తు
By అంజి Published on 24 Jan 2023 5:26 AM GMTహైదరాబాద్: రాష్ట్రంలోని 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి నాటికి సౌర విద్యుత్తు అందుబాటులోకి రానుంది. 12 జిల్లాల్లో రూ.32 కోట్లతో 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించింది. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టిఎస్‌ఆర్‌ఇడిసిఓ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 100కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేశామని, మరో 453 పాఠశాలలకు వర్క్ ఆర్డర్‌లు జారీ చేశామని తెలిపారు.
''ప్రాజెక్ట్ మొదటి దశలో.. మేము సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేస్తాము. రాబోయే కొద్ది నెలల్లో మొత్తం 1,521 పాఠశాలల పనిని పూర్తి చేయాలని మేము భావిస్తున్నాము'' అని ఒక సీనియర్ అధికారి తెలిపారు. గత సెప్టెంబరులో TSREDCO సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. 11 విక్రేతలను ఖరారు చేసింది. ఎంపికైన విక్రేతలు పాఠశాలల్లో 2 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 200 మందికి పైగా నమోదు చేసుకున్న పాఠశాలలను సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఎంపికైన 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 916 సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద, 605 నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కింద ఉన్నాయి.
సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయడం వల్ల పాఠశాలల వార్షిక విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్‌కు బదిలీ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ''స్మార్ట్ తరగతులు, పెద్ద సంఖ్యలో కంప్యూటర్ సిస్టమ్‌లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఇంటరాక్టివ్‌గా మారాయి. దీంతో పాఠశాలలకు కరెంటు బిల్లులు భారీగా పెరిగాయి. పాఠశాలల్లో అమర్చిన సోలార్ ప్యానెల్స్ వల్ల విద్యుత్ బిల్లు భారం తగ్గుతుంది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుంది'' అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.