తెలంగాణలోని నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం చేసినన తర్వాత 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ప్రకారం.. విద్యార్థులు వికారం, వాంతులు గురించి ఫిర్యాదు చేశారు. విద్యార్థులు పాఠశాల బెంచీలపై స్పృహతప్పి పడిపోయారు. ఫుడ్ పాయిజన్ జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
మధ్యాహ్న భోజనంలో వడ్డించిన అన్నం ఉడకకుండా ఉందని, పాఠశాల అధికారులు అందించే ఆహారం నాణ్యత, భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా తీసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు గల కారణాలను గుర్తించి, విచారణ జరిపి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.