తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని ఐఐఐటీ-బాసరలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఐదుగురు విద్యార్థులు.. జూనియర్లను ర్యాగింగ్ చేశారు. క్యాంపస్‌లోని హాస్టల్‌లో తమ జూనియర్లను ర్యాగింగ్ చేసినందుకు గాను ఐదుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు బుక్కైన ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు మైనర్ విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటన గురువారం ఐఐటీ-బాసరలో చోటుచేసుకుంది. మొత్తం ఐదుగురు విద్యార్థులు.. జూనియర్లపై దాడికి పాల్పడినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారిని ఇంకా పోలీసులు అరెస్టు చేయలేదు.
భైంసా పోలీసు సూపరింటెండెంట్ చెప్పిన వివరాల ప్రకారం..''ఈ సంఘటన గురువారం ఐఐఐటి-బాసరలోని హాస్టల్‌లో జరిగింది. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరం నుండి ముగ్గురు జూనియర్ విద్యార్థులను పిలిచి చెంపదెబ్బ కొట్టారు.'' అని చెప్పారు. హాస్టల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు ముగ్గురు మైనర్‌లతో సహా ఐదుగురు విద్యార్థులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ జరుగుతోందన్నారు.
ప్రీ యూనివర్శిటీ కోర్సు-IIలోని ఐదుగురు విద్యార్థులు ప్రీ యూనివర్సిటీ కోర్సు-Iలోని ముగ్గురు విద్యార్థులను కొట్టారని, సీనియర్లను గౌరవించనందుకు తీవ్ర పరిణామాలు ఉంటాయని జూనియర్లను బెదిరించారని పోలీసు అధికారి తెలిపారు. అసిస్టెంట్ స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ చేసిన ఫిర్యాదు ఆధారంగా, ఐదుగురు సీనియర్ విద్యార్థులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 506 (నేరపూరిత బెదిరింపు), తెలంగాణ సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.