త్వరలోనే పెన్షన్లు పెంపు, మహిళా సాయం పంపిణీ?..తెలంగాణ పథకాలపై రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చించింది.

By -  అంజి
Published on : 20 Feb 2026 12:18 PM IST

Pension, Women Aid, AICC Leadership, CM Revanth, Telangana

తెలంగాణ పథకాలపై రాహుల్ గాంధీ స్పెషల్ ఫోకస్.. త్వరలోనే పెన్షన్లు పెంపు, మహిళా సాయం పంపిణీ?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలపై కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘంగా చర్చించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ పనితీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల హామీల అమలు తీరు, ప్రజల్లోకి అవి వెళ్తున్న విధానంపై రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చర్చించారు. మేనిఫెస్టలోని వృద్ధాప్య పెన్షన్‌ రూ.4,000కు పెంపు, మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం అమలుపై వారు ఆరా తీశారు.

పథకాలపై సమీక్షలో వీటిపై అడగగా రాష్ట్ర ఆర్థిక స్థితి, అమలుకు సవాళ్ల గురించి సీఎం రేవంత్‌ వారికి వివరించారు. బడ్జెట్‌లో ఈ పథకాలకు నిధుల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సీఎం వివరించినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత మరియు అందరికీ న్యాయం అందించడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. "ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, సమగ్ర తెలంగాణను నిర్మించేందుకు కృషి చేస్తాం" అని ఆయన పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం 113 మున్సిపల్ ఛైర్మన్ పదవులలో 93 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడంపై అధిష్టానం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సమీక్షా సమావేశంపై బీఆర్ఎస్ (BRS) నేత టి. హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును సమీక్షించడాన్ని ఆయన తప్పుబట్టారు. "రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఢిల్లీలో రివ్యూ నిర్వహించడం తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగించడమే. ఇది స్వయంపాలన అనే భావనను దెబ్బతీస్తోంది" అని హరీష్ రావు విమర్శించారు.

Next Story