రేపటి నుంచి తెలంగాణలో సంబురాలు.. అందరూ ఆహ్వానితులే: సీఎం రేవంత్‌

ఈ నెల 7, 8, 9 మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ సంబురాల్లో అందరూ పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

By అంజి  Published on  6 Dec 2024 12:45 PM IST
celebrations, Telangana, CM Revanth

రేపటి నుంచి తెలంగాణలో సంబురాలు.. అందరూ ఆహ్వానితులే: సీఎం రేవంత్‌

ఈ నెల 7, 8, 9 మూడు రోజుల పాటు నిర్వహించే తెలంగాణ సంబురాల్లో అందరూ పాల్గొని ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. “మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ పండుగ అందరి పండుగ. ఈ ప్రజా ప్రభుత్వం అందరిది. ఈ సంక్షేమం అందరిది. రాష్ట్ర అభివృద్ధి అందరిదీ. ఇందులో అందరూ భాగస్వాములు కావాలి” అని అన్నారు.

''ఈ మూడు రోజుల పాటు సచివాలయ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు, బుద్ధపూర్ణిమ ప్రాంతం అంతా తెలంగాణ కార్నివాల్ జరుగుతుంది. మూడు రోజులు సాయంత్రం వేళల్లో పండుగ వాతావరణం ఉంటుంది. కవులు, కళాకారులు, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే అనేక కార్యక్రమాలు, తెలంగాణ పిండివంటలు, మహిళా సంఘాల గ్రూపులు ఉత్పత్తులు అన్నింటికీ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేస్తారు'' అని సీఎం తెలిపారు.

''మొత్తంగా వన భోజనాలకు వెళ్లినప్పుడు ఉండే వాతావరణం, కోలాహలం నెలకొంటుంది. బోనాలు, బతుకమ్మ, దసరా రోజున జమ్మికి వెళ్లిన సందర్భంగా ఎలా ఉంటుందో, గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో ఈ మూడు రోజుల పాటు అలాంటి పండుగ వాతావరణం సచివాలయ ప్రాంతమంతా ఉంటుంది. తెలంగాణ వాళ్లే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా అందరూ ఆహ్వానితులే'' అని సీఎం అన్నారు.

“తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి ఒక పండుగ. తెలంగాణ బ్రతుకే ఒక పండుగ. అందరూ భాగస్వాములు కావాలి. ఒక మంచి వాతావరణంలో ఈ పండుగ జరుపుకుందాం” అని సీఎం విజ్ఞప్తి చేశారు.

Next Story