హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వ్యక్తిగత సహాయకుడు, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్, కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కలెక్టరేట్ వద్ద కౌశిక్ రెడ్డి దూకుడుగా ప్రవర్తించాడని, అసభ్యకరంగా ప్రవర్తించాడని, గొడవ సృష్టించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కరీంనగర్ కలెక్టరేట్‌లో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. వాగ్వాదం కాస్తా తోపులాటగా మారింది, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తో సహా అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఆశ్చర్యపోయారు.