ట్రాఫిక్ నిబంధనలు ఎవ్వరు అయినా పాటించాల్సిందే. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుంది. అయితే కొందరు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడంతో వారు ప్రమాదాల భారీన పడడంతో పాటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అందుకనే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు ఈ-చలానాలతో హడలెత్తిస్తున్నారు.
సామాన్యులు, సెలబ్రెటీలు అని తేడా లేకుండా ఎవ్వరు నియమాలను ఉల్లఘించినా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాటిలో ప్రభుత్వ వాహనాలు కూడా ఉన్నాయి. కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్ 16 ఈఈ 3366) పై 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు మొత్తం 28 చలానాలు ఉన్నాయి. ఇందులో 24 సార్లు అతివేగం వల్ల వాహనం నడపడం వల్లే పడడం గమనార్హం. ఈ 28 ఈ-చలానాల మొత్తం రూ.27,580గా ఉంది.