విషాదం.. చ‌నిపోయింద‌నుకున్న పాము లేచి కాటేసింది

2 Years old boy dies of snake bite in Adilabad.వారిద్ద‌రికి పెళ్లైన 16 ఏళ్ల‌కు బాలుడు జ‌న్మించాడు. దీంతో ఆ బాలుడిని ఎంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2022 9:10 AM IST
విషాదం.. చ‌నిపోయింద‌నుకున్న పాము లేచి కాటేసింది

వారిద్ద‌రికి పెళ్లైన 16 ఏళ్ల‌కు బాలుడు జ‌న్మించాడు. దీంతో ఆ బాలుడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే.. ఆ ఆనందం ఎంతో కాలం నిల‌వ‌లేదు. పాము ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. చనిపోయింద‌నుకున్న పాము.. చిన్నారిని కాటు వేసింది. ఈ ఘ‌ట‌న ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. భీంపూర్‌ మండలం అంతర్గాం గ్రామంలో బైరెడ్డి సంతోష్, అర్చన దంపతులు నివ‌సిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా.. రెండేళ్ల క్రితం నైతిక్‌(2) జ‌న్మించాడు. లేక‌లేక సంతానం క‌లుగ‌డంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాబును ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. గురువారం మధ్యాహ్నం స‌మ‌యంలో బైరెడ్డి సంతోష్‌ ఇంటి ఆవరణలోకి రక్తపింజర పాము క‌నిపించింది.

స్థానికుల సాయంతో సంతోష్ ఆ పామును కొట్టారు. చ‌నిపోయింద‌ని ప‌క్క‌కు జ‌రిపారు. ఇంత‌లో ఆ పాము హ‌ఠాత్తుగా పైకి లేచి.. ప‌క్క‌నే నిల‌బ‌డి చూస్తున్న మ‌హిళ చేతిలోని చిన్నారి నైతిక్‌ను కాటేసింది. వెంట‌నే బాలుని రిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే.. అప్పటికే విషం శరీరమంతా పాకడంతో వైద్యులు చికిత్స అందిస్తుండగానే చిన్నారి మృతి చెందాడు. లేక‌లేక క‌లిగిన సంతానాన్ని పాము బ‌లి తీసుకోవ‌డంతో ఆ దంప‌తులు క‌న్నీరు మున్నీరుగా విల‌పిస్తున్నారు.

Next Story