Telangana: విషాదం.. చిన్నారి బాలుడి ప్రాణం తీసిన పల్లిగింజ
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడు ఒక్కసారిగా మృత్యువు లోకానికి వెళ్లిపోయాడు.
By అంజి Published on 10 March 2025 11:14 AM IST
Telangana: విషాదం.. చిన్నారి బాలుడి ప్రాణం తీసిన పల్లిగింజ
పుట్టుక, చావు ఈ రెండు ఈశ్వర్వేచ్ఛ... ఎప్పుడు పుడ తామో తెలియదు.. ఏ క్షణాల్లో మరణిస్తామో అంతకంటే తెలీదు. అందుకు నిదర్శనం ఈ ఘటనే. తాజాగా ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడు ఒక్కసారిగా మృత్యువు లోకానికి వెళ్లిపోయాడు. అది చూసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. వారి రోదన చూసి స్థానికులు సైతం బోరున విలపించారు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో గుండెల వీరన్న, కల్పన అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి అజయ్ (18 నెలలు) అనే బాలుడు ఉన్నాడు. అయితే అజయ్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు.
అదే సమయంలో ఇంటి ఎదుట ఆర బెట్టిన పల్లి గింజలను చూసి అజయ్ అక్కడికి వెళ్లి పల్లి గింజలను తినసాగాడు. ఇంతలో ఓ పల్లి గింజ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ అజయ్ కింద పడిపోయాడు. అది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అక్షయ్ ని స్థానిక ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎంకు తీసుకు వెళ్ళ మని వైద్యులు సూచించడంతో తల్లిదండ్రులు బాబును వెంటనే అక్కడికి తీసుకు వెళ్లారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ బాలుడు అక్షయ్ ఆదివారం రోజు మృతి చెందాడు. బాలుడి మరణ వార్తతో తల్లి దండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.