కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 14 ఏళ్లు
2009 చివరి అర్ధభాగంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఊపందుకుంది. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదం 11 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది.
By అంజి Published on 29 Nov 2023 5:48 AM GMTకేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 14 ఏళ్లు
2009 చివరి అర్ధభాగంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం రెండో దశ ఊపందుకుంది. 2009 నవంబర్ తర్వాత ధృడ సంకల్పం కేసీఆర్ పేరుకు పర్యాయపదంగా మారింది. ఆ ఏడాది 29న తెలంగాణకు రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. 'తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో' అనే నినాదం 11 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది. 33 పార్టీలు తెలంగాణకు మద్దతివ్వడం, రాష్ట్రపతి ప్రసంగంలోనూ రాష్ట్ర ఏర్పాటును ప్రస్తావించడంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.
డిసెంబరు 9 రాత్రి 11.30 గంటల సమయానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తామని అప్పటి హోంమంత్రి పి చిదంబరం ప్రకటించగానే కేసీఆర్ తన ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్నారు. ఆ తర్వాత స్వరాష్ట్ర కల సాకరమైంది. దీంతో గత 14 ఏళ్లుగా తెలంగాణలో ప్రతి ఏటా నవంబర్ 29ని దీక్షా దివస్‌గా జరుపుంటున్నారు. రాష్ట్ర గతిని మలుపు తిప్పిన ఘట్టం దీక్షా దివస్ అని, నాటి ఉద్యమ చైతన్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం దీక్షా దివస్ స్ఫూర్తిగా పునరంకింతం అవ్వాలని ప్రజలకు సూచించారు.
''అక్టోబర్ 21, 2009న సిద్దిపేటలో జరిగిన ఉద్యోగ గర్జన సభలో.. కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. రాష్ట్రం కోసం నేనే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నా.. ఎట్ల తెలంగాణ రాదో చూస్తాను అని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా నవంబర్ 29న సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ఆయన ఆమరణ నిరాహారదీక్షా వేదిక సిద్ధమైంది. హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి, కరీంనగర్ తీగలగుట్టపల్లిలోని తెలంగాణ భవన్‌కు నవంబర్ 28న చేరుకున్నారు. నవంబర్ 29 తెల్లావారేసరికి ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. మరోవైపు ఆయనకు.. ఉద్యమ శ్రేణులు రక్షణ కవచంగా నిలిచి పోలీసులను ప్రతిఘటించారు. దీంతో పోలీసులు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. అక్కడినుంచి ఆమరణ దీక్ష చేసేందుకు.. కేసీఆర్ సిద్దిపేటకు బయలుదేరారు. పోలీసులు గందరగోళం సృష్టించి ఆయనను అరెస్టు చేసి ఖమ్మంకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆచార్య జయశంకర్.. కేటీఆర్, నేనూ .. మా ఇంటి నుంచే నిరసనకు దిగుతున్నామని ప్రకటించారు. తదనంతర పరిణామాల్లో జయశంకర్‌ను ఖమ్మం తీసుకెళ్లారు. నన్ను మాత్రం అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులు వేసేందుకు మార్గదర్శకమైంది.. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దాం'' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.