తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం.. మంత్రి తలసాని ఏమన్నారంటే..?
120 Chickens die in Warangal suspecting Bird Flu.కరోనా మహమ్మారి నుంచి బయటపడకముందే దేశ వ్యాప్తంగా బర్డ్ ప్లూ, తెలంగాణలో కూడా బర్డ్ ఫ్లూ
By తోట వంశీ కుమార్ Published on 8 Jan 2021 3:03 PM ISTకరోనా మహమ్మారి నుంచి బయటపడకముందే దేశ వ్యాప్తంగా బర్డ్ ప్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ప్లూ బయటపడినట్లు కేంద్ర మత్స్య, పశుసంవర్థక శాఖ తెలిపింది. వలస పక్షుల్లోనే ఈ రకమైన ప్లూ కనిపిస్తోందని వెల్లడించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోనూ దీని ప్రభావం కనబడుతోంది. తెలంగాణలోని కొన్నిజిల్లాలో ఈవైరస్ సోకినట్లు అనుమానాలు రావటం ఇప్పుడు కలకలం రేపుతోంది. వరంగల్ అర్బన్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొప్పూర్‌లో 120 నాటు కోళ్లు మృతి చెందాయి.
సారయ్య కొన్ని నెలలుగా నాటుకోళ్లు పెంచి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. రెండు రోజుల వ్యవధిలోనే అవి మృతి చెందడంతో దాదాపు రూ.లక్ష మేరకు నష్టపోయినట్లు తెలిపారు. స్థానికంగా పశు వైద్యాధికారులు వాటిని పరీక్షించి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని తెలిపినా స్థానికుల్లో ఆందోళన మాత్రం తగ్గలేదు. కాగా.. మృతి చెందిన కోళ్ళను పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్ కు పంపించిన నమూనాల ఫలితాలు వచ్చే వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో సస్పెన్స్ కొనసాగే అవకాశం ఉంది.
పెద్దపల్లి జిల్లాలోనూ..
పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలో వారం రోజులుగా 300 కోళ్లు మృతి చెందాయి. వాటిని స్థానికంగా ఉండే పంట కాల్వలో వేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా గ్రామం లో చంద్రకళ అనే మహిళా ఇంట్లో ఇటీవల 40 కి పైగా కోళ్లు చనిపోవడం ఆందోళన రేపుతోంది. ఈ కోళ్లు బర్డ్ ఫ్లూ వలన చనిపోయి ఉంటాయని స్ధానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోన్న సమయంలో ఇలా జరగడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
మంత్రి తలసాని శ్రీనివాస్ ఏమన్నారంటే..?
రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లు లేవని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 1300 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు నిరంతర పర్యవేక్షణ జరుపుతూ బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రభల కుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.