ముగ్గురు ఉపాధ్యాయులు.. 12 మంది విద్యార్థినుల‌కు పాజిటివ్‌

12 KGBV students test positive for coronavirus. కెజీబీవీ లో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేపింది. 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా వచ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Feb 2021 3:57 AM GMT
12 KGBV students test positive for coronavirus

తెలంగాణ రాష్ట్రంలోనూ క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంఘం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ)లో కరోనా వైరస్ క‌ల‌క‌లం రేపింది. 12 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా వచ్చింది. తొలుత ముగ్గురు విద్యార్థినిల‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. అనుమానంతో మిగ‌తావారంద‌రికి కూడా క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం 150 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా, అందులో 132 మంది స్టూడెంట్స్, 18 మంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అందరికీ నెగటివ్ రాగా.. 12 మంది బాలికలకు మాత్రం పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ బాలిక‌ల‌ను హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అయితే.. ర్యాపిడ్ టెస్ట్‌లలో నెగటివ్ వచ్చిన వారందరికీ తిరిగి ఆర్టీపీసిఆర్ ద్వారా శాంపిల్స్ కలెక్ట్ చేశారు అధికారులు. అయితే.. ఈ రిపోర్టులు రేపు రానున్నాయి. ఆ రిపోర్టుల్లో ఇంకా ఎవరికైనా పాజిటివ్‌ వస్తుందోననే భయంలో ఇటు సిబ్బంది అటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఉన్నత పాఠ‌శాల‌లోని ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌తో పాటు మ‌రో మండ‌లంలోని ఓ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఒక టీచ‌ర్‌కు క‌రోనా నిర్థార‌ణ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. దీంతో స‌ద‌రు ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే పాఠ‌శాల‌ల్లో క‌రోనా ప‌రీక్షలు నిర్వ‌హించేందుకు అధికారులు సిద్దం అయ్యాయి. ఇక శుక్ర‌వారం కొత్త‌గా రాష్ట్రంలో 178 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,631కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఒక‌రు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 1633కి పెరిగింది. తాజా ఫ‌లితాల్లో జీహెచ్ఎంసీలో 30 కేసులు న‌మోదు అవ్వ‌గా.. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 20, రంగారెడ్డిలో 15, క‌రీంన‌గ‌ర్‌లో 10 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయ్యాయి.

ఇక తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా అదుపులోనే ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. పాజిటివ్ రేటు 0.43శాతంగా ఉంద‌ని, ప్ర‌తి రోజు 200లోపే కేసులు న‌మోదు అవుతున్నాయ‌న్నారు.


Next Story