అత్యవసర ఫిర్యాదులకు దేశవ్యాప్తంగా ఒకటే నంబర్.. అదే 'డయల్ 112'
112 is India's all in one emergency helpline number.అత్యవసర సమయాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై
By తోట వంశీ కుమార్ Published on 6 Aug 2021 8:25 AM ISTఅత్యవసర సమయాల్లో ఫిర్యాదుల స్వీకరణకు ఇకపై దేశ వ్యాప్తంగా ఒకే నంబరు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ప్రజలు కాల్ చేసే డయల్ 100 స్థానంలో డయల్ 112 ను ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితమే నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టా సారించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు శాఖ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్దం చేసింది.
మరో రెండు నెలల వరకు డయల్ 100 అందుబాటులో ఉండనుంది. డయల్ 100కి కాల్ చేసినా అది 112కు అనుసంధానం అయ్యేలా చేశారు. ఈ నెల చివరి వరకు.. 112కు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ అధికారులు, కాంట్రల్ రూంలో పనిచేసేవారికి నేర్పాలని నిర్ణయించారు. సామాజిక మాధ్యమాలు, ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు అర్ధమయ్యే విధంగా ప్రచార చిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ విషయంలో ఇప్పటికే ముందున్నాయి.
వందల మంది ఒకేసారి ఫోన్ చేసినా స్వీకరించేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశాయి. ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఫలకార్డులు పట్టుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పోలీస్ వాహనాలపై కూడా 112 స్టిక్కర్లను అతికించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర శాఖల ఉద్యోగుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక మహారాష్ట్ర కూడా ప్రజలకు అవగాహాన కల్పించేందుకు శరవేగంగా అడుగులు వేస్తుంది.
112 ఎందుకు?
ప్రస్తుతం దేశంలో వివిధ అత్యవసర సేవలకు వివిధ నంబర్లు అందుబాటులో ఉన్నాయి. పోలీసు సేవలకు 100, అంబులెన్స్‌కు 108, అగ్నిమాపక సేవలకు 101 నంబర్లను ఉపయోగిస్తున్నారు. అయితే, అమెరికా, యూరప్ దేశాలలో అన్ని సేవలకు ఒకే నంబరును వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా ఒకే నంబరును తీసుకురావాలని నిర్ణయించింది. కొత్త నంబరులో విపత్తు నివారణ, గృహ హింస, వేధింపులకు సంబంధించిన సేవలను కూడా జోడించనుంది. సాంకేతిక సమస్యలు, సాఫ్ట్‌వేర్ మార్పులు తదితర కారణాల వల్ల ప్రస్తుతం నాలుగైదు రాష్ట్రాల్లో మాత్రమే ఈ నంబరు అమలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అక్టోబరు నాటికల్లా దేశవ్యాప్తంగా ఈ నంబరును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.