11,062 ఉపాధ్యాయు పోస్టుల భర్తీ.. 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు: సీఎం రేవంత్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

By అంజి  Published on  7 Nov 2024 2:26 AM GMT
teacher posts, teachers promoted, CM Revanth, Telangana

11,062 ఉపాధ్యాయు పోస్టుల భర్తీ.. 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను రెండో విడతగా మరికొన్ని నియోజకవర్గాలకు మంజూరు చేయబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంపుతో పాటు విద్యా వ్యవస్థ ప్రక్షాళన వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని నవంబర్ 14 చాచా నెహ్రూ జయంతి రోజున 15 వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.

ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుంచి మహాత్మా జ్యోతిబా పూలే, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం వారితో ముఖాముఖి మాట్లాడారు. విద్యా రంగంలో చేపట్టిన సమూల మార్పులు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతోనే డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచామని చెబుతూ విద్యా రంగంలో నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

త్వరలోనే ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుందని, 21 వేల మంది టీచర్లకు పదోన్నతులు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుందని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరంలోగా నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. చదువుతో పాటు నైపుణ్యత ఉంటేనే ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే విద్యార్థి, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, రాష్ట్రంలోని ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేశామని తెలిపారు. క్రీడల పట్ల కూడా విద్యార్థులను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌.. ఒలింపిక్స్ క్రీడలు లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

Next Story