10th Exams: నేడు ఇంగ్లీష్ పరీక్ష.. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్క్వాడ్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ.. ప్రశ్నాపత్రాల లీక్‌లు కలకలం రేపుతున్నాయి.
By అంజి Published on 6 April 2023 6:44 AM IST
10th Exams: నేడు ఇంగ్లీష్ పరీక్ష.. ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్క్వాడ్
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న వేళ.. ప్రశ్నాపత్రాల లీక్‌లు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి సెంటర్‌లో సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమిస్తున్నారు. ఇవాళ ఇంగ్లీష్ భాషా పరీక్ష జరగనుంది. సిట్టింగ్ స్క్వాడ్‌కు సంబంధించి ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ముగియకముందే ప్రశ్నాపత్రాలు బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ సిబ్బందిని కూడా పరీక్షల పర్యవేక్షణకు వినియోగించుకునేలా నిర్ణయం తీసుకుంది.
నేడు జరిగే ఇంగ్లీష్ భాషా పరీక్షతో పాటు మిగిలిన పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ పెంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్ శాఖల సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే క్రిమినల్ కేసులు ఉన్న టీచర్లను ఇన్విజిలేటర్ల విధ/లను తప్పించాలని పాఠశాల విద్యాశాఖ అధికారి శ్రీదేవసేన జిల్లా విద్యాశాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. 2,652 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
పరీక్షల విధుల్లో 34,500 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారు. అలాగే మొత్తం పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లను ప్రభుత్వం నియమించింది. సిట్టింగ్ స్క్వాడ్లుగా తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ప్రతి సెంటర్ ఇద్దరు సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష ముగిసే వరకు ఉంటారు. పరీక్షా సెంటర్ల దగ్గర పోలీసు పహారాను పెంచుతున్నారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, ఏఎన్‌ఎంలు ఫోన్లు వాడకుండా. అలాగే ఇన్విజిలేటర్లను తనిఖీ చేసి లోపలికి పంపాలని అధికారులు స్పష్టం చేశారు.