రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపేట గ్రామంలో మంగళవారం ఉదయం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ) కింద కందకం తవ్వుతుండగా మట్టి దిబ్బ కిందపడి ఓ మహిళ మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. మృతురాలు కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మర్పాక రాజవ్వ (50) అనే మహిళగా గుర్తించారు. ఆమె ఇతర కార్మికులతో కలిసి వాటర్ ట్యాంక్ వద్ద కందకం తవ్వుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఉదయం 9 గంటల సమయంలో పని ప్రదేశంలో మట్టి కుప్ప కూలి కార్మికులపై పడటంతో రాజవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే మరో ఆరుగురు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటి తర్వాత చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. గాయపడిన మిగిలిన కార్మికుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కర్ణాల లహరి, పల్లం దేవవ్వ, కర్నాల శ్యామల, ఎడ్ల రామవ్వ, వద్నాల అమృత, సందు చంద్రయ్య గాయపడ్డారు.
విషయం తెలుసుకున్న జడ్పీ చైర్ పర్సన్ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణరాఘవ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.