ధనిక రాష్ట్రానికి ఈ కోతల దరిద్రమేంది సారు?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 May 2020 11:59 AM IST
ధనిక రాష్ట్రానికి ఈ కోతల దరిద్రమేంది సారు?

జీతం ఎక్కువ.. తక్కువ అన్నది కాదు. ఒక లెక్క ప్రకారం వచ్చే ఆదాయం సడన్ గా యాభై శాతం పడిపోతే పరిస్థితి ఏమిటి? ఎవరికి వారు.. తమకొచ్చే ఆదాయానికి తగ్గట్లే తమకంటూ ఒక జీవనశైలిని అలవాటు చేసుకోవటంతో పాటు.. వచ్చిన ఆదాయాన్ని దేనికెంత ఖర్చు పెట్టుకోవాలన్న లెక్కలు చాలానే ఉంటాయి. అలాంటి వేళలో.. ఏదో ఒక కారణం చూపించి జీతాన్ని కోత వేస్తే కలిగే కష్టం.. జరిగే నష్టం మామూలుగా ఉండదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.

అవకాశం దొరికిన ప్రతిసారీ తెలంగాణ ధనిక రాష్ట్రంగా.. సంపన్న రాష్ట్రంగా అభివర్ణించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. లాక్ డౌన్ వేళ జీతాల కోత విషయంలో తీసుకుంటున్న నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వమే స్వయంగా జీతాల్లో కోత పెడితే.. ప్రైవేటు సంస్థలు.. వ్యక్తుల మాటేమిటి? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారింది. ప్రభుత్వమే నిర్మోహమాటంగా జీతాల్లో కోత పెట్టేశాక.. ప్రైవుటు సంస్థలు మాత్రం చూస్తూ ఉరుకుంటాయా?

ప్రభుత్వాలే జీతాలు ఇవ్వలేకపోతున్నాయి.. మీకు మేం ఏమిస్తామన్న ప్రశ్నను లక్షలాదిమంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటివేళ.. గడిచిన గతాన్ని వదిలేసి.. ఈ నెలాఖరులో తమకు వచ్చే జీతం మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు ఉద్యోగులు. తాజాగా వారి ఆశల మీద నీళ్లు పోస్తూ.. ఈసారికి కోత తప్పదని సీఎం కేసీఆర్ స్పష్టం చేయటం తెలిసిందే. ఒకవైపు ధనిక రాష్రమని గొప్పలు చెప్పే సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఈ లొల్లి ఏమిటి? అన్నది క్వశ్చన్.

మరోవైపు ఆర్థికంగా కిందీమీదా పడుతున్న ఏపీ ప్రభుత్వం.. తన ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ జీతం ఇచ్చేస్తామని మాట ఇచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నేపథ్యంలో కేసీఆర్ సైతం దాన్నే ఫాలో అవుతారని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. అలాంటివారికి నిరాశకు గురి చేస్తే.. కోతల జీతాల్ని ఈసారికి భరించక తప్పదని తేల్చేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఫుల్ జీతాలు ఇస్తున్నప్పడు తెలంగాణలో ఎందుకు ఇవ్వరన్నది క్వశ్చన్. దీనికి సీఎం కేసీఆర్ చెప్పే సమాధానం.. మేలో రాష్ట్రానికి రూ.13వేల కోట్లు రావాల్సి ఉంటే కేవలం రూ.3,100 కోట్లు వచ్చాయన్నది సారు వాదన.

కేసీఆర్ సర్కారుకు లాక్ డౌన్ కష్టాలు ఎంత ఉంటాయో.. ఏపీ ప్రభుత్వానికి అదే రీతిలో ఉంటాయన్నది మర్చిపోకూడదు. తెలంగాణలో ఆదాయం పడిపోతే.. ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉండటం ఖాయం. అలాంటప్పుడు ఏపీలో ఫుల్ జీతాలు ఇచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు ఇవ్వట్లేదు? అన్నది క్వశ్చన్? దీనికి సమాధానం చెప్పేదెవరు? అన్నదిప్పుడు కీలకంగా మారింది.

Next Story