తెలంగాణలో మరో కరోనా కేసు..ఇప్పటికీ మూడు కేసులు

By రాణి  Published on  16 March 2020 6:22 AM GMT
తెలంగాణలో మరో కరోనా కేసు..ఇప్పటికీ మూడు కేసులు

తెలంగాణలో నిన్నటి వరకూ రెండు కరోనా కేసులు నమోదవ్వగా..ఒకరికి రోగం నయం అవ్వడంతో డిశ్చార్జి చేశారు వైద్యులు. ఇంతలోనే మరో వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా..వైద్య పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్థారణయింది. రంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి నెదర్లాండ్ నుంచి 10 రోజుల క్రితం రాష్ర్టానికి వచ్చాడు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాధితుడికి కరోనా సోకినట్లుగా పూణె వైరాలజీ ల్యాబ్ వెల్లడించింది. ఆదివారం సదరు వ్యక్తితో పాటు..సౌదీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఎయిర్ హోస్టెస్ కు కూడా కరోనా పరీక్షలు చేశారు. ఎయిర్ హోస్టెస్ కు మాత్రం కరోనా లేదని తెలిసింది. తెలంగాణలో తొలి కరోనా కేసు దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి నిర్థారణయింది. ప్రస్తుతం ఆ వ్యక్తి వైరస్ నుంచి కోలుకోవడంతో గాంధీ వైద్యులు ఇంటికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. కాగా..రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరూ గాంధీలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు. వారిరువురి కుటుంబ సభ్యులను సైతం ఆస్పత్రుల్లో చేర్పించి..వైద్య పరీక్షల కోసం నమూనాలను సేకరించారు.

Also Read : ప్రియుడితో రాసలీలలు .. బంధువు చూశాడని..

రాష్ర్టంలో కొత్తగా మరో రెండు కరోనా కేసులు నమోదవ్వడంతో గడిచిన 7-10 రోజుల్లో వారిద్దరూ ఎవరెవరిని కలిశారు ? వారు ఇంకా ఎవరెవరిని కలుస్తుంటారు ? ఇంకా వైరస్ ఎంత మందికి వ్యాపిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు వైద్యులు. కానీ..వారిద్దరూ ఎవరెవరిని కలిశారన్నది తెలుసుకోవడం మాత్రం కాస్త కష్టమే. బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఎవరెవరిని కలిశారన్నదానిపై ఆరా తీస్తున్నారు. వీలైనంత వేగంగా వైరస్ లక్షణాలున్న వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా చేయగలిగితే..వైరస్ వ్యాపించకుండా అడ్డుకోవచ్చని భావిస్తోంది రాష్ర్ట వైద్యశాఖ.

Also Read : ఇటలీలో వైరస్ వ్యాప్తికి అసలు కారణమేంటి ?

అలాగే ఇతర దేశాలనుంచి శంషాబాద్ కు వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి తమకు కరోనా వైరస్ లేదని నిర్థారణయ్యాకే ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రయాణికులను బయటికి పంపుతున్నారు. ఏ ఒక్కరికి కరోనా లక్షణాలున్నా వారిని అట్నుంచి అటే గాంధీ, ఫీవర్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

Next Story